Kavitha: సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబుపై ప్రివిలేజ్ నోటీసులు ..! 3 d ago
TG : మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించి సభకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు బుధవారం ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో కలిసి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కి ఎమ్మెల్సీ కవిత నోటీసులను అందించారు. మంగళవారం శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించి తాను అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున పరిశ్రమలు, ఐటీ, శాసన సభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమాధానమిస్తూ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు తయారు కాలేదనీ, ప్రపంచ బ్యాంకు నుంచి ఎలాంటి సాయాన్ని అభ్యర్థించలేదని చెప్పారని గుర్తు చేశారు. అయితే ప్రపంచ బ్యాంకుకు రాష్ట్రప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కోసం ఈ ఏడాది సెప్టెంబర్ 19న రూ. 4,100 కోట్ల రూపాయల సాయాన్ని అభ్యర్థించిందనీ, ప్రాజెక్టుకు డీపీఆర్ ఉందని స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. కానీ సభలో మాత్రం ఈ విషయం చెప్పకుండా మంత్రి దాచివేశారని వివరించారు.
అంతేకాకుండా, ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని కలిసిన సందర్భంలోనూ సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు రూ.14 వేల కోట్లు కేటాయించాలని కోరారని పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంక్‌కు ,కేంద్ర ప్రభుత్వానికి మూసీ ప్రాజెక్టుపై డీపీఆర్ గురించి ఓ రకంగా, శాసన మండలికి మరో రకంగా చెప్పడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు శాసన మండలిని అవమానపరిచారని తెలిపారు. కాబట్టి శాసన మండలి నియమావళి 168 (ఏ) కింద వెంటనే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబుల పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసుల కింద చర్చకు అనుమతించాలని ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు.